News

సెలెబ్రిటీలకు కేటీఆర్ సవాల్


ఎముకలు కొరికే చలిలో దేహాన్ని వణికించే ఐస్ గడ్డలతో ఓ చాలెంజ్. అదే ఐస్ బకెట్ చాలెంజ్. చాలెంజ్ ఏం లేదు... జస్ట్ ఐస్ ముక్కలను ఒంటి మీద కుమ్మరించుకోవడమే. ఆ తర్వాత రైస్ బకెట్ చాలెంజ్. లేని వాళ్లకు బకెట్ బియ్యాన్ని ఉచితంగా అందించడం. సోషల్ కాజ్ కోసం ఓ వ్యక్తి విసిరిన సవాల్ అది. కానీ, ఐస్ బకెట్‌కు వచ్చినంత క్రేజ్ మాత్రం రాలేదు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సెలెబ్రిటీలకు ఓ సవాల్ విసిరారు. ఆయనా ఓ మంచి పని కోసమే ఆ సవాల్‌ను విసిరారు. మహేశ్ సహా టాలీవుడ్ స్టార్లు, క్రీడాకారులకు ఆ చాలెంజ్‌ను స్వీకరించాలని సూచించారు. ఇంతకీ ఆ సవాల్ ఏంటంటే.. చేనేత వస్త్రాలను ధరించాలని. చేనేత వస్త్రాలకు డిమాండ్ తగ్గిపోవడం, చేనేత కార్మికులకు ఉపాధి తగ్గిపోతుండడంతో.. వాటికి ప్రాచుర్యం కల్పించేలా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మన్మథుడు నాగార్జున, మంచు లక్ష్మి, వివేక్ ఒబెరాయ్, సమంత, సానియా మీర్జా, ఇతర సినీ స్టార్లకు ఈ సవాల్‌ను ప్రతిపాదించారు. ‘‘చేనేత కార్మికులను ఆదుకోవడానికి నేను చేనేత వస్త్రాలను ధరిస్తున్నా.. మరి మీరు ధరిస్తారా?’’ అంటూ వారిని ఓ రకంగా నిలదీసినంత పనిచేశారు. ఇక, ఈ చాలెంజ్‌ను కమల్ హాసన్, సానియా మీర్జా వెంటనే స్వీకరించారు. తాను ఈ సవాల్‌కు సిద్ధమని, తన తండ్రి తన జీవితాంతం చేనేత వస్త్రాలనే ధరించారని కమల్ స్పందించారు. ఇక, ఆస్ట్రేలియన్ ఓపెన్ పూర్తై హైదరాబాద్ రాగానే చేనేత వస్త్రాలనే ధరిస్తానని సానియా మీర్జా చెప్పింది. అంతేగాకుండా సహ క్రీడాకారులైన మహేశ్ భూపతి, రోహన్ బోపన్న, షట్లర్ పీవీ సింధు, రానా దగ్గుబాటిలకు ఈ సవాల్‌ను విసిరింది సానియా. మరి కేటీఆర్ విసిరింది మంచి సవాలే అయినా.. దానిని ఎంత మంది స్వీకరిస్తారో? మరి చేనేతకు ఎంత ప్రాచుర్యం లభిస్తుందో చూడాలి.